బోస్టన్, మే 12: ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొన్న రిచర్డ్ స్లేమాన్ (62) మృతిచెందారు. రెండు నెలల కిందట మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. అది విజయవంతం కావటంతో రెండు వారాల అనంతరం డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. తాజాగా ఆయన మరణించారు. అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, శస్త్రచికిత్సకు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి వల్ల ఆయన మరణించలేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపాయి. అంతకుముందే ఆయనకు మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా, మూత్రపిండాల వ్యాధితో బాధపడ్డ రిచర్డ్‌కు 2018లో మరణించిన ఓ వ్యక్తి కిడ్నీని అమర్చారు. అయితే, ఇది విఫలం కావడంతో జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు.