Nepal | పొరుగున ఉన్న హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. అక్కడ ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ అవినీతి, అడ్డగోలు నిర్ణయాలపై యువత కదం తొక్కింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో జన్-జడ్ నిరసనకారులు (Gen Z protesters) విధ్వంసం సృష్టించారు. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
వివిధ శాఖల మంత్రులు కూడా వైదొలిగారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లను నియంత్రించడానికి సైన్యం రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఎవరైనా విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించి శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు రావాలని నిరసనకారులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జన్ జడ్ యువత పలు డిమాండ్ల (Gen Z Demands)ను సైన్యం ముందుకు తీసుకొచ్చింది.
ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని (Rewrite Constitution) డిమాండ్ చేసింది. అంతేకాదు, మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు (probe loot of 3 decades) జరపాలని కోరింది. తాము చేపట్టిన ఈ ఉద్యమం ఏ ఒక్క పార్టీ, వ్యక్తి కోసం కాదని స్పష్టం చేసింది. ఒక జనరేషన్, దేశ భవిష్యత్తు కోసం అని తెలిపింది. దేశంలో నిరుద్యోగం, వలసలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. కొత్త రాజకీయ వ్యవస్థ ఆధారంగానే దేశంలో శాంతి నెలకొంటుందని పేర్కొంది. అంతేకాదు, ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. నేపాల్ సైన్యం తమ ప్రతిపాదనలను సానుకూలంగా అమలు చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ డిమాండ్లను ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది.
Also Read..
Nepal | నేపాల్లో కర్ఫ్యూ.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు : సైన్యం
Nepal PM | నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు?.. రేసులో యువ నేతలు