Donald Trump : వెనెజులా (Venezuela) నుంచి అమెరికా (USA) కు వలసొచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులా గ్యాంగ్‌ను బహిష్కరించడం కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుతగలడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్ (Truth social)’ వేదికగా ఒక పోస్టు పెట్టారు.
‘మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్లను బలవంతంగా పంపడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పు చెప్పింది. వలసొచ్చిన వాళ్లలో అనేకమంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు, నేరస్థులు ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఈలోగా వాళ్లు దేశంలో అనేక నేరాలకు పాల్పడుతారు. ఇది అమెరికన్లకు హాని చేస్తుంది. కోర్టు తీర్పు మరింత మంది నేరస్థులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని ప్రోత్సహిస్తుంది. వారు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. గత అధ్యక్షుడు జో బైడెన్ లక్షలాది మంది క్రిమినల్స్ అక్రమంగా మన దేశంలోకి రావడానికి అనుమతించారు. వాళ్లను బయటకు పంపించేందుకు మాత్రం మనం సుదీర్ఘమైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి. మన దేశాన్ని రక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్లకు కృతజ్ఞతలు. ఇది అమెరికాకు ప్రమాదకరమైన రోజు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను వినియోగించి అమెరికాలో ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్‌ను బహిష్కరించాలని ట్రంప్ ప్రయత్నించారు. ఈ చర్యలకు అక్కడి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. వారి బహిష్కరణను చట్టబద్ధంగా సవాల్ చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపైనే ట్రంప్ తాజాగా స్పందించారు.