Chicken biryani angry | చికెన్ బిర్యానీ లేదన్న కోపంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి రెస్టారెంట్‌కు నిప్పంటించాడు. ఈ ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో జరిగింది. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉండి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తున్నది. చికెన్ బిర్యానీ దొరక్కపోవడంతో కోపంతో ఊగిపోతూ పెట్రోల్ పోసి నిప్పంటించే సన్నివేశాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూయార్క్ క్వీన్స్ ఏరియా జాక్సన్ హైట్స్‌లోని దక్షిణాసియా సంఘం భవనంలో బంగ్లాదేశీ రెస్టారెంట్ ఉంది. అర్ధరాత్రి సమయంలో బిర్యానీ కావాలంటూ 49 ఏండ్ల చోఫెల్ నోర్బు వచ్చాడు. అయితే, అప్పటికే బిర్యానీ అయిపోయిందని రెస్టారెంట్ సిబ్బంది చెప్పడంతో చోఫెల్కు కోపం నశాలానికి అంటింది. వెంటేనే వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చి చల్లి నిప్పంటించాడు. దాంతో రెస్టారెంట్‌ను సిబ్బంది మూసివేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగలేదని సమాచారం.
ఈ ఘటన రెస్టారెంట్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఫుటేజీలో చోఫెల్ నోర్బు రెస్టారెంట్ దగ్గర నిలబడి ఉండటం, కొద్ది సేపటి తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించడం చూడవచ్చు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం సేవించి ఉన్న తనకు తినేందుకు బిర్యానీ లేదని చెప్పడంతో కోపం వచ్చి నిప్పుపెట్టినట్లు నోర్బు పోలీసుల ఎదుట వెల్లడించాడు.