Solar Energy | సిడ్నీ: సూర్యాస్తమయం తర్వాత సౌరశక్తి ఉత్పత్తిని సుసాధ్యం చేసేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ మార్గాన్ని కనుగొన్నారు. రాత్రి వేళల్లో సైతం మన ఇండ్లకు శక్తిని అందించగలిగే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు ఆ టెక్నాలజీతో రూపొందించిన ఓ పరికరాన్ని పరీక్షించారు. ఈ డివైజ్ అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుందో లేదో అంచనా వేయాలని యోచిస్తున్నారు.
థర్మోరేడియేటివ్ విద్యుత్తు ఉత్పత్తి సూత్రంతో పనిచేసే ఈ టెక్నాలజీలో భూమి ఉపరితలం నుంచి వెలువడే ఉష్ణోగ్రతకు, అంతరిక్షంలో ఉండే చల్లదనానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగిస్తారు. వాస్తవానికి భూమితోపాటు అన్ని రకాల వస్తువుల నుంచి రాత్రి వేళల్లో సైతం ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెలువడుతుంది. ఆ రేడియేషన్‌ను ఈ పరికరం ఒడిసిపట్టి విద్యుత్తుగా మారుస్తుంది.
అందుకోసం ఆ డివైజ్‌లో ప్రధానమైన ఓ విడిభాగం ఉంటుంది. అదే సెమీకండక్టర్. రేడియంట్ హీట్‌ను (వికిరణ ఉష్ణాన్ని) ఉపయోగించుకోగలిగేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెమీకండక్టర్ భూమి నుంచి పరారుణ కాంతి రూపంలో వెలువడే శక్తిని సంగ్రహించి విద్యుత్తుగా మారుస్తుంది. తద్వారా ఆ పరికరం రాత్రి వేళల్లో సైతం సౌరశక్తిని ఉత్పత్తి చేయగలుగుతుందని యూఎన్ఎస్డబ్ల్యూ పరిశోధకుల బృందం సారథి నెడ్ ఎకిన్స్ డ్యూక్స్ తెలిపారు.