మాస్కో, అక్టోబర్ 23: తమ దేశానికి చెందిన రెండు ప్రధాన ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తీవ్రంగా స్పందించారు. అమెరికా కానీ, ఏ ఇతర దేశం కానీ తెచ్చే ఒత్తిడికి మాస్కో ఎన్నటికీ తలొగ్గదని స్పష్టం చేశారు. రష్యా భూ భాగంపైకి ఏదైనా బలమైన దాడి జరిగితే దానికి తీవ్ర ప్రతిస్పందన ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
తమపై ఆమెరికా ఆంక్షలు విధించడాన్ని ‘శత్రు చర్య’గా ఆయన అభివర్ణిస్తూ, అలాంటి చర్యల వల్ల రష్యా-అమెరికా సంబంధాలు ఎంతమాత్రం బలోపేతం కావని అన్నారు. ‘ఇది మాపై ఒత్తడి తెచ్చే చర్య. కానీ ఏ ఆత్మగౌరవ దేశమైనా, ఆత్మగౌరవ ప్రజలైనా ఒత్తిడిలో నిర్ణయం తీసుకోరు’ అని ఆయన పేర్కొన్నారు.