Donald Trump | వాషింగ్టన్, మే 28: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చర్చలకు రష్యా నిరాకరిస్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీరు నిప్పుతో చెలగాటం అడుతున్నారని’ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించారు. ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలో దాడులకు రష్యా మిలిటరీ సన్నాహాలను ఉద్ధృతం చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నేను లేకపోతే రష్యాలో ఇప్పటికే పలు దుర్ఘటనలు జరిగి ఉండేవి.
పుతిన్ గ్రహించని విషయం ఏమిటంటే అది నిజంగా చెడ్డది. అతను నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. దీనికి రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్ ప్రతిస్పందిస్తూ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. నిజమైన చెడు ఫలితం మూడవ ప్రపంచయుద్ధం మాత్రమేనని అన్నారు.
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పాలనుకునే వారికి పుతిన్ కొన్ని షరతులు పెడుతున్నారు. నాటో కూటమిని విస్తరించబోమని రాతపూర్వక హామీని పుతిన్ కోరుకుంటున్నారని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది.