Vladimir Putin | ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న సైనికుల తల్లులతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. వారితో చాలా సమయం పాటు మాట్లాడిన పుతిన్.. వారి బాధలను పంచుకున్నారు. మాస్కోలోని తన ఇంటికే వారిని ఆహ్వానించి మరీ వారితో ముచ్చటించారు. ఈ సమావేశానికి 17 మంది హాజరైనట్లుగా సమాచారం. సరైన ఆయుధాలు, శిక్షణ లేకుండానే తమ బిడ్డలను యుద్ధంలోకి నెట్టివేస్తున్నారని పలువురు మహిళలు ఆరోపణలు చేయడంతో పుతిన్ ఈ సమావేశాన్ని జరిపినట్లుగా పలు పత్రికలు వార్తాకథనాలను ప్రచురించాయి. అమెరికా జనరల్ మార్క్ మిల్లీ వెల్లడించిన ప్రకారం, రష్యా ఇప్పటివరకు యుద్ధంలో లక్ష మందికి పైగా సైనికులను కోల్పోయింది.
సమావేశానికి వచ్చిన కొందరు తల్లులు తలపై నల్లటి కండువాలు కట్టుకున్నారు. ఇది తమ దుఃఖానికి చిహ్నంగా పరిగణించినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా పుతిన్ వారితో మాట్లాడుతూ.. సైనికులతో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి యోగక్షేమాలు కనుక్కుంటున్నానని చెప్పారు. మీ కుమారులు ఓ లక్ష్యం సాధించేందుకు వెళ్లి విజయం సాధించారని, కొడుకును కోల్పోయిన బాధకు మించింది ఏదీ లేదని వారితో అన్నారు. ముఖ్యంగా తల్లులకు కుమారుడిని కోల్పోవడం కంటే బాధ మరోటి ఉండదన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో ఉన్న సైనికులంతా నిజమైన హీరోలని, సైనికుల తల్లులందరికీ రుణపడి ఉంటానన్నారు.