మాస్కో: రష్యా ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నదని, అయితే ఈ పరిస్థితి దేశానికి ఎన్నో విలువైన పాఠాలను నేర్పిందని ఆదివారం ఆ దేశాధ్యక్షుడు పుతిన్ అన్నారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే పార్లమెంటరీ ఎన్నికల దృష్ట్యా అధికార ‘యునైటెడ్ రష్యా’ పార్టీ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్ రష్యా భూభాగంపై జరుగుతున్న ఉగ్రవాద దాడులను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం మన ముందున్న అన్ని సవాళ్లను నిస్సందేహంగా అధిగమిస్తామని పుతిన్ అన్నారని రష్యా వార్తా సంస్థ ‘టాస్’ పేర్కొన్నది. క్రస్నోడార్లోని ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసిన కొన్ని గంటల వ్యవధిలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.