ఇస్లామాబాద్: గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న తెహ్రీక్-ఎ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే రాజకీయ పార్టీ కార్యకర్తలపై పాక్ పోలీసులు జరిపిన కాల్పులలో 250 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు మరణించగా 1500 మందికిపైగా గాయపడ్డారు. టీఎల్పీ నాయకుడు హఫీజ్ సాద్ హుస్సేన్ రిజ్వీపై పోలీసులు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రిజ్వీ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆ పార్టీ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న సమాచారం మాత్రం అధికారికంగా వెలువడలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను పాకిస్థాన్ ప్రభుత్వం బలపరచడంపై అనేక రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. టీఎల్పీ అధినేత రిజ్వీ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. పాక్ ప్రభుత్వ వ్యతిరేక, గాజా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు ప్రారంభించిన రిజ్వీ లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో సోమవారం టీఎల్పీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర ఘర్షణలో ఓ పోలీసు అధికారి మరణించగా పెద్ద సంఖ్యలో ఇతరులు గాయపడ్డారు.