Israel Hezbollah War | టెల్ అవీవ్, సెప్టెంబర్ 28: దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆయా దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది మరణించారు. తాజా దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి ఆ సంస్థను దారుణమైన దెబ్బ తీసిన ఇజ్రాయెల్ మరో కీలక విజయాన్ని సాధించింది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ కూడా మరణించారు. నస్రల్లా మరణంతో అప్రమత్తమైన ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఇజ్రాయెల్ దాడిని ఖమేని తీవ్రంగా ఖండించారు.
గత ఏడాదిగా గాజాతో జరిగిన యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోని ఇజ్రాయెల్ లెబనాన్‌లోనూ అసంబద్ధ విధానాన్ని అవలంబిస్తున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా ముస్లింలంతా లెబనాన్‌కు, హెజ్బొల్లాకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నస్రల్లా మృతిపై ఇరాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. లెబనాన్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశవ్యాప్తంగా అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.
శుక్రవారం ఐరాసలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగించారు. లెబనాన్‌లో తమ లక్ష్యం నెరవేరే వరకు తమ దాడులు ఆగవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. కుడి చేతిలో నల్లని రంగుతో ఉన్న మ్యాప్‌లో మధ్య ప్రాచ్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సిరియా, యెమన్ దేశాలు ఉండగా వాటికి ఆయన ‘శాపం’గా పేర్కొన్నారు. అలాగే ఎడమ చేతిలో పచ్చ రంగుతో ఉన్న మ్యాప్‌లో భారత్, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా దేశాలు ఉండగా, వాటిని ఆయన ‘దీవెన’గా తెలిపారు. అయితే రెండు మ్యాపుల్లో పాలస్తీనా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా శాపం దేశాల్లో ఇరాన్ ఉండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రస్తుతం పశ్చిమాసియాలోని సంఘర్షణ పరిస్థితులకు ఇరాన్, దాని మిత్ర దేశాలే కారణమని ఆరోపించారు. అదే సమయంలో పచ్చని రంగుతో ఉన్న ‘దీవెన’ దేశాల గురించి మాట్లాడుతూ అవన్నీ తమ మిత్ర, కాబోయే మిత్ర దేశాలుగా పేర్కొన్నారు. కాగా, నెతన్యాహూ ప్రసంగిస్తుండగా, నిరసనగా అనేక మంది దౌత్యవేత్తలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు నస్రల్లా మృతి విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తన అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే టెల్ అవీవ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సహా సెంట్రల్ ఇజ్రాయెల్ అంతా సైరన్లు మోగించి స్వాగతం చెప్పారు. సైరన్లు మోగిన కొద్ది క్షణాలకే యెమెన్ నుంచి ఆ దేశ భూభాగంపైకి క్షిపణి దాడి జరిగింది. అయితే దానిని మిలటరీ సమర్థంగా తిప్పికొట్టింది. నెతన్యాహూ లక్ష్యంగా ఆ దాడి జరిగిందా అన్న దానిపై అధికారులు వివరణ ఇవ్వలేదు.
శనివారం కూడా ఇజ్రాయెల్ మిలటరీ దక్షిణ బీరుట్, తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై దాడులు చేసింది. అదే సమయంలో హెజ్బొల్లా ఉత్తర, కేంద్ర ఇజ్రాయెల్‌తో పాటు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై డజన్ల కొద్దీ రాకెట్లు, క్షిపణులతో దాడులు చేసింది. శుక్రవారం దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా, 91 మంది గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
శుక్రవారం తాము జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చినట్టు ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది. దానిని హెజ్బొల్లా కూడా నిర్ధారించింది. ఈ దాడిలో అతని కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా మృతి చెందినట్టు సమాచారం. కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధంలో లెబనాన్‌కు ఇది దారుణమైన దెబ్బ అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నస్రల్లా అంతంతో తమ లక్ష్యం పూర్తి కాలేదని, మరిన్ని దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాప్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెర్జీ హలేవి తెలిపారు.
నస్రల్లా మరణం తమ నిరోధక బలాన్ని మరింత పెంచుతుందని హమాస్ ప్రకటిం చింది. నస్రల్లా మార్గాన్ని కొనసాగిస్తామని ఇరాన్ ప్రకటించింది. నస్రల్లాను చంపడాన్ని నిరసిస్తూ ఇరాన్లో నిరసనలు పెల్లుబికాయి. వేలాది మంది రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా నస్రల్లా చిత్రాలు, పాలస్తీనా, హెజ్బొల్లా జెండాలు చేతపట్టి ప్రదర్శనలు నిర్వహించారు.
గత 32 ఏండ్లుగా హెజ్బొల్లాను విజయవంతంగా నడిపిస్తూ వచ్చిన నస్రల్లా మరణంతో దాని వారసుడెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నస్రల్లా మృతి చెందినంత మాత్రాన ఆ సంస్థ కుప్పకూలుతుందనో, బలహీన పడుతుందనో భావించడం అత్యాశే. అయితే దాని ఆత్మవిశ్వాసం దెబ్బతినడం ఖాయం. ఈ పరిస్థితుల్లో హషీమ్ సఫీద్దీన్‌ను వారసునిగా ఎంపిక చేయవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూస్తూ జిహాద్ కౌన్సిల్ గ్రూపుల సభ్యునిగా ఉన్న సఫీద్దీన్.. నస్రల్లా కజిన్ కూడా. 2017లోనే ఇతడిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా కూడా ఇతనికి సంస్థలో వివిధ హోదాలు కట్టబెట్టి అతడిని నేతగా తయారు చేశారు. అతని భౌతిక ఆకారం, ప్రవర్తన కూడా నస్రల్లాను పోలి ఉంటుందని, అతడే కాబోయే నేత అని అంటున్నారు.
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణలో హసన్ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సిరియన్ అంతర్యుద్ధంలో హెజ్బొల్లా తరఫున పోరాటం జరిపి అధ్యక్షుడు బషర్ అస్సద్ స్థానాన్ని బలీయం చేయడానికి సహాయం చేశాడు. ఇరాన్‌తో పాటు హమాస్ వంటి సంస్థల నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తయారు చేశాడు. బీరుట్‌లోని పేద కుటుంబంలో 1960లో జన్మించిన నస్రల్లా 16 ఏండ్లకే షియా రాజకీయ, పారా మిలటరీ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత హెజ్బొల్లా తీవ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించారు. 1992లో అప్పటి హెజ్బొల్లా అధ్యక్షుడి హత్య తర్వాత ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 34 రోజుల పాటు ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణ తర్వాత ఆ దేశాన్ని అడ్డుకోవడంలో సఫలీకృతుడు కావడంతో అరబ్ దేశాల్లోనూ అతడి పరపతి మరింత పెరిగింది. 2011లో సిరియాతో జరిగిన అంతర్యుద్ధంలో హెజ్బొల్లా దళాలు బషర్ అల్-అసద్ దళాలతో చేతులు కలిపాయి. ఈ చర్య అరబ్ దేశాల్లో అతడి కీర్తిని తగ్గించినప్పటికీ, ఇరాన్‌తో మాత్రం సంబంధాలు పటిష్టం చేశాయి.