వాషింగ్టన్: ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉన్న అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్‌తో జరిగిన పశ్చిమాసియా యుద్ధంలో మాత్రం చావు దెబ్బ తగిలింది! ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినప్పటికీ, ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి పెద్ద ఆర్థిక, ఆయు ధ నష్టం సంభవించింది. ఈ యుద్ధంలో ఆరేడు శక్తిమంతమైన విమానాలు, రాడార్లను కోల్పోయిన అమెరికా& శుక్రవారం తాజాగా మరో రెండు యుద్ధ విమానాలను కోల్పోయింది. అలాగే ఆ దేశానికి చెందిన రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను ఇరాన్ కూల్చివేసింది. అమెరికా విమాన వాహక నౌకకు కూడా నష్టం కలిగించింది. మొత్తం మీద అమెరికాకు రూ.వేల కోట్ల నష్టం ఏర్పడింది.
అసలు ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా చేసిన వ్యూహరచన పూర్తిగా విఫలమైందని యుద్ధ నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ ఇరాన్ పాలనను మార్చుదామనే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది తప్ప, హొర్ముజ్ జల సంధిని ఇరాన్ ఆధీనంలోకి తీసుకొంటుందని, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని యూఎస్ అస్సలు ఊహించలేదని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఒత్తిడితో యుద్ధంలోకి ఆదరా బాదరాగా అడుగుపెట్టిన అమెరికాకు ఇప్పుడు యుద్ధం నుంచి బయటపడే ‘ఎగ్జిట్ ప్లాన్’ లేక ఎంగిలిలో పడ్డ ఈగలా గిలగిలా కొట్టుకుంటున్నది.
అయినప్పటికీ ఆడంబర ప్రకటనలు చేస్తూ తన బెదిరింపులతో శత్రు దేశానికి లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ‘ఇరాన్‌ను అమెరికా ఓడించి పూర్తిగా నాశనం చేసింది. పనిని పూర్తి చేయబోతున్నాం. ఈ పనిని మేం అత్యంత వేగంగా ముగించబోతున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అగ్రరాజ్యానికి భారీ దెబ్బ తగలడం విశేషం.
తమ విమానం కూల్చివేత, సెర్చ్ ఆపరేషన్ గురించి చర్చించడానికి వ్యాఖ్యానించడానికి అమెరికా అధ్యక్షుడు తిరస్కరించారు. ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జరిగిన ఘటనలు ఇరాన్‌తో చర్చలకు ఆటంకం కావని అంటూ ‘ఇది యుద్ధం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు యూఎస్‌కు చెందిన ఏ-10 విమానాన్ని పర్షియన్ గల్ఫ్‌లో తమ రక్షణ దళాలు కూల్చివేశాయని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ విమానం కూలిపోయిందా, లేక కూల్చివేశారా అన్న విషయంపై స్పష్టత లేదని పేరు తెలపడానికి ఇష్టపడని ఒక యూఎస్ అధికారి పేర్కొన్నారు.
అలాగే అది ఎక్కడ కూలింది, అందులోని సిబ్బంది పరిస్థితిపై కూడా సమాచారం లేదని అన్నారు. కాగా, ఒక వైపు ఇరాన్ నావిక, వైమానిక దళాలను పూర్తిగా ధ్వంసం చేసామంటూ అగ్రరాజ్యం ప్రకటిస్తుండగా శుక్రవారం ఇరాన్ అటు అమెరికా విమానాలపై ఇటు గల్ఫ్‌లోని చమురు శుద్ధి క్షేత్రంపై దాడులు చేయడమే కాక, ఇజ్రాయెల్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌ను ధ్వం సం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను శత్రు దేశం కూల్చివేయడం గత 20 ఏండ్ల కాలంలో ఇదే తొలిసారి. ఒక పక్క ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేశామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ఆఖరిసారిగా అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాక్ 2003లో కూల్చివేసింది.
రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హూస్టన్ హూస్టన్ కాంట్వెల్ తెలిపిన ప్రకారం ఇటీవలి దశాబ్దాల్లో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరగడానికి ప్రధాన కారణం అమెరికా దళాలు ఎక్కువగా అధునాతన విమాన నిరోధక వ్యవస్థలు లేని ప్రత్యర్థులతో పోరాడటమేనని తెలిపారు. ఇప్పటివరకు ఇది జరగకపోవడం ఒక అద్భుతమేనని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా విమానాలు అతి తక్కువ ఎత్తులో ఎగరడం ఇరాన్‌కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా దళాలు 13,000 దాడులు నిర్వహించగా, 12,300కు పైగా లక్ష్యాలపై గురిపెట్టినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఒక పక్క యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాల నుంచి బాంబు దాడులు ఎదుర్కొంటున్నా, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు లక్ష్యంగా దాడులు చేసి ప్రాంతీయ అస్థిరతను సృష్టించింది. కాగా, భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణిని ఈ దాడికి ఉపయోగించి ఉండవచ్చునని రిటైర్డ్ మెరైన్ కర్నల్ మార్క్ కాన్సియన్ అభిప్రాయపడ్డారు. ఒకవైపు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ పూర్తి విజయం సాధించినట్టు అమెరికా ప్రచారం చేసుకుంటున్నదని అన్నారు. అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని అన్నారు.
రక్తపాతం లేని యుద్ధాలు చేయడానికి అమెరికా ప్రజలు అలవాటు పడి ఉన్నారని, అయితే దేశంలోని చాలామంది పౌరులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. వారి పరంగా చూస్తే యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలు ఎంతమాత్రం అంగీకరించరని అన్నారు. యుద్ధాల్లో ఫైటర్ జెట్లు కూలిపోవడం చాలా అరుదైనప్పటికీ హెలికాప్టరు, ఇతర చిన్న విమానాలు మాత్రం యుద్ధంలో దెబ్బతినడం మామూలే. 1980లో అమెరికా జరిపిన ఒక విఫల ఆపరేషన్‌లో టెహ్రాన్‌లో బందీగా ఉన్నవారిని రక్షించే క్రమంలో రెండు విమానాలు ఢీ కొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.