POK-Pak | పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పై పాకిస్థాన్ వైఖరి బయట పడింది. అది విదేశీ భూభాగం అని ఇస్లామాబాద్ హైకోర్టులో ఒప్పుకున్నది. పీఓకే విదేశీ భూభాగం అని, అక్కడ పాకిస్థాన్ చట్టాలు చెల్లబోవని ఓ పాత్రికేయుడి కిడ్నాప్ కేసు విచారణ సందర్భంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు పాక్ అదనపు అటార్నీ జనరల్ ఈ సంగతి చెప్పారు. రావల్పిండిలోని తన ఇంట్లో గల అహ్మద్ ఫర్హద్ షా అనే విలేకరిని పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఐఎస్ఐ’.. గత నెల 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ మోసిన్ అక్తర్ కయానీ సారధ్యంలో ధర్మాసనం శుక్రవారం విచారించింది. అహ్మద్ ఫర్హాద్‌ను కోర్టు ముందు హాజరు పర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పాక్ సర్కార్ తరఫున వాదించిన అదనపు అటార్నీ జనరల్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పోలీసుల కస్టడీలో అహ్మద్ ఉన్నాడని తెలిపారు. అది విదేశీ భూభాగం అని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు అమలవుతాయని, పాక్ చట్టాలు చెల్లుబాటు కానందున, అహ్మద్ ను కోర్టులో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
పాక్ అదనపు అటార్నీ జనరల్ వాదపై జస్టిస్ కయానీ స్పందిస్తూ.. ఒకవేళ పీఓకే విదేశీ భూభాగమైతే, పాక్ రేంజర్లు, సైన్యం ఆ ప్రాంతంలోకి ఎందుకు చొరబడుతున్నారని చురకలేశారు. సామాన్యులను విచారణ పేరిట నిఘా సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. పాక్ ప్రభుత్వ అదనపు అటార్నీ జనరల్ వాదనతో పీఓకే..భారత్‌దే అన్న విషయం తేటతెల్లమైంది. భారత్‌లో 1947 నుంచి పీఓకే.. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నిత్యం చెబుతున్నారు.