Donald Trump | వాషింగ్టన్: తమ ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే.. తామూ అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందే ఆయన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తో మోదీ సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చించిన తర్వాత ఇరువురూ ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇండియా మా ఉత్పత్తులపై ఎలా సుంకాలు విధిస్తే.. మేమూ అలానే విధిస్తాం.
భారత్‌తో పరస్పర సుంకాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా అన్యాయం, ఎక్కువగా ఉన్నాయని అన్నారు. భారత్‌కు అతిపెద్ద చమురు, గ్యాస్ సరఫరాదారుగా అమెరికా మారగలిగే ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నట్టు ప్రకటించారు. భారత్‌తో వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది భాగమని చెప్పారు. ఈ ఏడాది నుంచి భారత్‌కు ఆయుధ విక్రయాలు కొన్ని బిలియన్ డాలర్లు పెరిగుతాయని, ఎఫ్-35 ఫైటర్ జెట్లను సైతం భారత్‌కు సరఫరా చేస్తామని ప్రకటించారు.
ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా కలిసి పని చేయనున్నట్టు ట్రంప్ చెప్పారు. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు తహవ్వుర్ రాణాను వెంటనే భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు.
డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు ఆలోచిస్తున్నాయనే వార్తలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. మోదీతో భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ ఒక చెడ్డ ప్రతిపాదనను తెచ్చింది. దీనిని ఎవరూ అంగీకరించరు. డాలర్‌తో ఆటలాడితే 100 శాతం సుంకాలు విధిస్తానని నేను చేసిన హెచ్చరికతో ఇప్పుడు ఆ ప్రతిపాదన గురించి మాట్లాడేందుకు వారు(బ్రిక్స్ దేశాలు) భయపడుతున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలు చేయాలని వారు అనుకుంటే మళ్లీ నా దగ్గరకు వచ్చి సుంకాలు వద్దని అడుక్కోవాల్సి వస్తుంది. ఈ మాట నేను చెప్పిన మరుక్షణమే బ్రిక్స్ అంతమైంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కు రప్పించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎవరైనా అక్రమంగా వేరే దేశంలోకి ప్రవేశించి, నివసించే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మానవ అక్రమ రవాణా వ్యవస్థపైనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ట్రంప్‌తో భేటీలో అదానీ అంశం చర్చకు వచ్చిందా? అని మోదీని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. రెండు దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఎప్పుడూ అలాంటి వ్యక్తిగత అంశాలపై చర్చించరని మోదీ బదులిచ్చారు. ట్రంప్ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, తనకు భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభించాల్సిందిగా అమెరికా విద్యాసంస్థలను ఆహ్వానించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మోదీ సమావేశమయ్యారు.