న్యూఢిల్లీ: ఈ నెలలో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గానే హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో సమావేశం జరుగుతుందని, ఇరు దేశాల వాణిజ్య ఒప్పందానికి మార్గం ఏర్పడుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాయి. దీంతో ఆ సమావేశంలో ట్రంప్‌ను ఎదుర్కోలేకే మోదీ వర్చువల్‌గా హాజరవుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీపావళి అయిపోయినా దీపావళి ఉత్సవాల పేరుతో సమావేశానికి డుమ్మా కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి.
వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్-అమెరికా నెలల తరబడి చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతుల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు శిక్షగా భారత్‌పై సుంకాలను 25 నుంచి 50 శాతానికి పెంచుతూ అమెరికా ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాల్సిందేనంటూ అగ్రరాజ్యం పట్టుబడుతూ వస్తున్నది. ‘ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనడానికి, ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నాను’ అని ప్రధాని మోదీ గురువారం ఎక్స్‌లో మలేషియా ప్రధాని అన్వర్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ అన్నారు.
కౌలాలంపూర్ సమావేశానికి వెళ్లి అక్కడకు వస్తున్న ట్రంప్ చేతిలో ఇరుక్కుపోవాలని ప్రధాని మోదీ అనుకోవడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ట్రంప్‌తో బహిరంగంగా మాట్లాడటం మోదీకి ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌ను నేనే ఆపా, రష్యా నుంచి చమురును కొనుగోలు ఆపేయడానికి భారత్ అంగీకరించింది లాంటి ప్రకటనలు ట్రంప్ నోటి నుంచి వచ్చిన తర్వాత ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించిందని ఆయన అన్నారు.
రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేతకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. భారత్ క్రమంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను తగ్గిస్తూ వస్తున్నదని, ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా నిలిపివేస్తుందని ఆశిస్తున్నామని, ప్రధాని మోదీ ఈ మేరకు తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. బుధవారం శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘చమురు కొనుగోలు అనేది ఒక ప్రక్రియ. దానిని వెంటనే ఆపివేయలేం. కానీ ఈ ఏడాది చివరి నాటికి వారు తమ దిగుమతులను సున్నా స్థాయికి తీసుకు వస్తారు. నిన్నే భారత ప్రధాని మోదీతో దీని గురించి మాట్లాడా. ఇది చాలా పెద్ద డీల్. సుమారు 40 శాతం చమురు డీల్’ అని అన్నారు.