మాస్కో : తూర్పు ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ప్రాంతం దొనెట్స్ పూర్తిస్థాయిలో తమకు అప్పగిస్తేనే యుద్ధం ఆపేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ ఈ విషయాన్ని తెలియజేసినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అటు జెలెన్స్కీ, ఇటు పుతిన్‌తో చర్చలు జరుపుతున్న ట్రంప్‌నకు రష్యా డిమాండ్ మింగుడుపడటం లేదు. పూర్తిస్థాయిలో దొనెట్స్క్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా పట్టుదలతో ఉంది.
దక్షిణ రష్యాలోని ఒక ప్రధాన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడిచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్, శుద్ధి కేంద్రాల్లో ఒకటైన ‘ఓరెన్‌బర్గ్ ప్లాంట్’ను ఉక్రెయిన్ డ్రోన్లు దెబ్బకొట్టాయి. దీంతో ఇక్కడి ఓ వర్క్‌షాప్‌కు మంటలు అంటుకున్నాయని, కొంతభాగం దెబ్బతిన్నదని ప్రాంతీయ గవర్నర్ సోలెంట్సేవ్ చెప్పారు. కజకిస్థాన్ నుంచి గ్యాస్ సరఫరాను ఆపేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి.