ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 16:43:12

రోడ్డుపై డ్రైవ్‌ చేసే.. ప్రతి కిలోమీటరుకు ట్యాక్స్‌

రోడ్డుపై డ్రైవ్‌ చేసే.. ప్రతి కిలోమీటరుకు ట్యాక్స్‌

లండన్‌: ఇకపై వాహనదారులు రోడ్డుపై డ్రైవ్‌ చేసే ప్రతి కిలోమీటరుకు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. కిలోమీటరు దూరం ప్రయాణానికి సుమారు 10 పెన్స్ లేదా 1.50 పౌండ్ల మధ్య (సుమారు రూ.150) పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త రోడ్డు ట్యాక్స్‌ దిశగా బ్రిటన్‌ ఆలోచిస్తున్నది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇకపై కారు నడపడం లేదా బైక్ రైడింగ్ చేయడం చాలా ఖరీదుగా మారనున్నది. ఆ దేశ చాన్సలర్ (ఆర్థిక మంత్రి) రిషి సౌనాక్ ఈ కొత్త వాహన పన్ను ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల నుంచి వాహనదారులు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల ఏర్పడే 40 బిలియన్ డాలర్ల పన్ను అంతరాన్ని ఇది భర్తీ చేస్తుందని భావిస్తున్నారు.

బ్రిటన్‌ సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రత్యేక, నిర్దిష్ట మైన టోల్, రోడ్‌ ట్యాక్సులు ఉన్నాయి. యూకేలోని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల సాంప్రదాయిక ఇంధనాలపై విధించిన వ్యాట్ ఆదాయాన్ని ఆ దేశం కోల్పోతున్నది. ఈ నేపథ్యంలో ‘పే యా‌ యు డ్రైవ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టాలని బ్రిటన్‌ యోచిస్తున్నది. జాతీయ రహదారి పన్నుల పథకం అమలుపై నివేదికను ఆ దేశ ట్రెజరీ విశ్లేషించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎంత దూరం డ్రైవ్‌ చేస్తే అంత మేరకు ట్యాక్స్‌ చెల్లించాలన్న ఈ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావచ్చని తెలుస్తున్నది. 2007 లో ఇదే తరహాలో ఒక స్కీమ్‌ను బ్రిటన్‌లో ప్రవేశపెట్టారు. మైలు దూరం డ్రైవ్‌కు 1.50 పౌండ్ల (సుమారు రూ.150) చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది. బ్రిటన్‌లోని సుమారు 1.8 మిలియన్ల మంది వాహనదారులు ఈ ప్రణాళిక ఎప్పటికీ ఫలించబోదని పిటిషన్‌లో సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

మరోవైపు సౌనాక్ ఇప్పుడు అన్ని రహదారులపై అంటే రెసిడెన్షియల్, సిటీ రోడ్లు లేదా మోటారు వాహనాల మార్గాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారా లేదా టోల్ స్కీమ్‌లు ఉన్న రహదారులకు మాత్రమేనా అన్నది స్పష్టం కాలేదు. ఒక వేళ దీనిని అమలు చేస్తే కిలోమీటరుకు ఎంత చార్జ్‌ చేస్తారు, రోజు, సమయం లేదా రహదారిని బట్టి ట్యాక్స్‌ ఉంటుందా అనేది కూడా స్పష్టం కాలేదు. గతంలో చాలా మంది దీనిని ‘స్టీల్త్ టాక్స్’ (రహస్య పన్ను) అని అన్యాయమైనదిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదిత ట్యాక్స్‌పై వాహనదారుల నుంచి మరోసారి అలాంటి వ్యతిరేకతే వస్తుందని అనుమానిస్తున్నారు.

అయితే ఇలాంటి చర్యల వల్ల ప్రజా రవాణా వైపు ప్రజలు మొగ్గే అవకాశమున్నదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే సాంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెద్దగా విజయవంతం కానప్పటికీ కర్బన ఉద్గార స్థాయిలు తగ్గించడానికి ఈ కొత్త రోడ్డు ట్యాక్స్‌ స్కీమ్‌ సహాయపడుతుందని భావిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి