గాజా: హమాస్, ఇజ్రాయెల్ దాడులు (Israel Hamas War) రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు (Palestinians) మృతిచెందారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని హమాస్ దాడికి పాల్పడింది. దీంతో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 251 మందిని బందీలుగా హమాస్ పట్టుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్నది. దీంతో ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారో తెలియనప్పటికీ, మహిళలు, చిన్నారులు, సాధారణ పౌరులు మాత్రం నెతన్యాహూ సైన్యానికి బలవుతూనే ఉన్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 64,231 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారని తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది. తాజాగా నిరాశ్రయులైన వారిపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని, దీంతో 25 మంది మరణించారని గాజా సిటీలోని షిఫా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. వారిలో తొమ్మిదిమంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారని తెలిపారు.