Khawaja Asif | ఇస్లామాబాద్, ఏప్రిల్ 25 : తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఆ పాపానికి అమెరికా, పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. స్కైన్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి చేసిన ప్రకటనతో పాక్‌ను ఉగ్రదేశమని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని మరోసారి రుజువైంది.
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాంలో టెర్రరిస్టు దాడిలో పరోక్షంగా పాకిస్థాన్‌దే బాధ్యత అని భారత్ ఇప్పటికే పేర్కొనగా, పహల్గాం దాడిని భారతే నాటకంగా తెరకెక్కించిందని ఖవాజా ఆరోపించారు. చాలాకాలంగా ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉంది కదా? అని జర్నలిస్టు యాల్దా హకీమ్ ప్రశ్నించగా, ‘మేము ఈ పాడుపనిని గత మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల కోసం చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఇన్నాళ్లుగా చేసింది తప్పేనని ఆయన తెలిపారు. సోవియట్ యూనియన్, అఫ్గాన్లపై దండయాత్రలకు ఉగ్రవాదులను అమెరికా పావుగా వాడుకుందని ఆరోపించారు.
తమ దేశంలో లష్కరే తాయిబా సంస్థ ఉనికే లేదని మంత్రి స్పష్టం చేశారు. లష్కర్ అనేది పాత పేరని, ఇప్పుడది ఉనికిలోనే లేదని ఆయన పేర్కొన్నారు. 2019లో జరిగిన బాలాకోట్ తరహాలో పాకిస్థాన్‌పై భారత్ వైమానిక దాడి జరిపే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు, అలాంటి ప్రయత్నమే కనుక పునరావృతం అయితే ఈసారి పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. అయితే రెండు అణ్వాయుధ శక్తుల మధ్య ఘర్షణ ఎప్పుడూ ఆందోళనకరమైనదేనని మంత్రి ఆసిఫ్ అన్నారు.