Airstrike | ఆఫ్ఘనిస్థాన్ పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది. ఏడు గ్రామాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపగా.. లామన్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ వైమానిక దాడిని పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ రహస్య స్థావరాలపై ఈ దాడి జరిగిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం సమాచారం. ఈ దాడి బర్మల్లోని ముర్గ్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది మానవతా సంక్షోభాన్ని మరింత పెంచింది.
ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారని, ఆ ప్రాంతంలో నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చట్టబద్ధమైన హక్కు అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో వజీరిస్తానీ శరణార్థులు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య దాడి జరిగింది. పాకిస్థాన్లో తాలిబాన్ ఉగ్రవాదుల ఉనికి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తున్నది. అయితే, ఆఫ్ఘన్ తాలిబాన్ ఈ ఆరోపణలను ఖండించింది.