న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బుట్టలో వేసుకోవడానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇటీవల వీరు ముగ్గురూ వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను వైట్ హౌస్ విడుదల చేసింది. అసీం మునీర్ ఓ పెట్టెలోని రాళ్లను ట్రంప్‌నకు చూపిస్తున్నట్లు, షరీఫ్ చిరునవ్వులు చిందిస్తున్నట్లు, ట్రంప్ ఆసక్తిగా గమనిస్తున్నట్లు ఈ ఫొటోలో కనిపించింది.
వీరు ముగ్గురూ ఓవల్ ఆఫీస్‌లో రహస్యంగా సమావేశమైన తర్వాత ఈ ఫొటో విడుదలైంది. షరీఫ్, మునీర్ మిరుమిట్లుగొలిపే రాళ్లను చూపించి ట్రంప్‌ను ముగ్ధుడిని చేయగలిగినట్లు కనిపిస్తున్నది. కొన్ని వారాల క్రితం అమెరికన్ మెటల్స్ కంపెనీ పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది.