పేషావర్, డిసెంబర్ 25 : తూర్పు అఫ్గనిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హందుల్లా ఫిత్రత్ తెలిపారు. తమ దేశానికి సరిహద్దున ఉన్న పక్తికా ప్రావిన్స్‌పై పాక్ జరిపిన వైమానిక దాడులలో ఆరుగురు పౌరులు గాయపడ్డారని ఆయన చెప్పారు. ఈ పిరికిపంద చర్యను తాలిబాన్ ప్రభుత్వం సహించదని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రకటించారు. పక్తికా ప్రావిన్సులో తీవ్రవాద శిక్షణా శిబిరాలను అంతం చేసి తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు మంగళవారం తాము దాడులు జరిపినట్టు తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడని పాక్ భద్రతా అధికారులు విదేశీ మీడియాకు వెల్లడించిన మరుసటి రోజే అఫ్గన్ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) తీవ్రవాద సంస్థకు చెందిన శిబిరంపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించినట్టు పాకిస్థానీ అధికారి ఒకరు విదేశీ మీడియాకు వెల్లడించారు. అఫ్గన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లతో టీటీపీకి ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే అఫ్గన్‌లో జరిగినట్లే పాకిస్థాన్‌లో కూడా ఇస్లామిక్ మత చట్టాలను అమలు చేయాలన్న లక్ష్యంతో టీటీపీ పనిచేస్తున్నట్టు పాక్ అధికారి చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో గత శనివారం టీటీపీ జరిపిన దాడిలో 16 మంది పాక్ భద్రతా సిబ్బంది మరణించారు. అఫ్గన్‌లోని తమ తీవ్రవాద శిక్షణ శిబిరంపై దాడి జరగడాన్ని టీటీపీ, అఫ్గన్ పాక్ ప్రతీకార చర్యగా భావిస్తున్నది. పాక్, అఫ్గన్ పొరుగు దేశాలైనప్పటికీ రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు క్షీణించాయి. తమ దేశంలో జరిగిన టీటీపీ దాడులన్నీ అఫ్గన్‌ను స్థావరంగా చేసుకుని జరిగినట్టు పాక్ ఆరోపిస్తున్నది.