న్యూఢిల్లీ, ఇస్లామాబాద్, అక్టోబర్ 3: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నెలకొన్న అశాంతి, ఆగ్రహ జ్వాలలకు ఆ దేశ అణచివేత విధానాలు, వనరుల దోపిడి కారణమని భారత్ పేర్కొన్నది. పాక్ సైన్యం కాల్పుల్లో 12 మంది పౌరులు మృతి చెందటం, 150 మందికి పైగా తీవ్రంగా గాయపడటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పీవోకేలో నెలకొన్న పరిస్థితులపై భారత్ తొలిసారి స్పందించింది. అమాయక పౌరులపై పాకిస్థాన్ సైనిక దళాల క్రూరత్వాన్ని ఖండిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.
పాకిస్థాన్ పోలీసులు శుక్రవారం పాత్రికేయులపై దాడికి తెగబడ్డారు. ఏకంగా ఇస్లామాబాద్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లోకి ప్రవేశించి పాత్రికేయులు, నిరసనకారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి కెమెరాలను, మీడియా సామాగ్రిని ధ్వంసం చేశారు. దాడిపై పాకిస్థాన్‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పాకిస్థాన్ హోం మంత్రి నఖ్వీ దర్యాప్తునకు ఆదేశించారు.పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది.