న్యూఢిల్లీ ఏప్రిల్ 8, 2026 : పాకిస్థాన్‌కు విజయోత్సవ రోజు. ఎందుకంటే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఎన్నో ఏండ్ల తర్వాత అతిపెద్ద దౌత్య విజయాన్ని పాక్ సాధించింది. అయితే ఆ ఆనందం పాక్‌కు ఎంతోసేపు నిలవలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడి జరపడంతో కాల్పుల విరమణ ఒప్పందం ఆదిలోనే నీరుగారిపోయింది. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై జరిగిన ఈ దాడి కారణంగా వందలాది మంది మరణించారు. ఇప్పుడు గందరగోళమంతా కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగమా కాదా అన్నదే. ఉభయ పక్షాలకు ఒప్పందాన్ని వివరించే బాధ్యత వహించిన పాకిస్థాన్ ఇప్పుడు ఈ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఎన్నడూ భాగం కాదని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం బుధవారం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గురించి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ప్రకటన చేస్తూ లెబనాన్తోసహా అంతటా ఇది వర్తిస్తుందని స్పష్టంగా ప్రకటించారని వాదిస్తున్నది. ఇరాన్, అమెరికా తమ మిత్రదేశాలతో కలిసి లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్ని చోట్ల తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది అని షరీఫ్ బుధవారం ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే దీన్ని ఇజ్రాయెల్ స్వాగతిస్తూ అయితే లెబనాన్ ఇందులో భాగం కాదని స్పష్టం చేసింది. అంతేగాక గంటల్లోనే లెబనాన్‌పై భీకరం దాడులు చేసింది.
ప్రధాని షరీఫ్ ప్రకటనను సమర్థించిన అమెరికాకు ఇరాన్ రాయబారి రిజ్వాన్ సయీద్ షేక్ సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాల్పుల విరమణ చట్రంలో లెబనాన్‌ను చేర్చడం జరిగిందని నొక్కిచెప్పారు. రెండు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందంపై షరీఫ్ చేసిన ప్రకటన అత్యంత ప్రామాణికమైనదిగా ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణలు చారిత్రాత్మకంగా జఠిలంగా ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనన్న పాకిస్థాన్ వాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు జరిపింది. ఇరాన్ అనుబంధ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో లెబనాన్ ఈ యుద్ధంలో చిక్కుకుంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ బీరుట్‌తోపాటు ఇతర కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మ ద్ మఘేర్ ఘలీబర్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు ప్రతీకారంగా కాల్పుల విరమణ తర్వాత కొద్దిసేపు తెరచిన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇరుపక్షాలకు తెలియచేయడం పాకిస్థాన్ బాధ్యత. పాక్ దాన్ని చెడగొట్టినట్లు కనపడుతున్నది. ఇరాన్ నుంచి అందుకున్న దానికి భిన్నమైన ప్రతిని పాక్ అమెరికాకు అందచేసి ఉండవచ్చని ఇరాన్ మీడియా తెలిపింది. అదే విధంగా అమెరికా నుంచి అందుకున్న దానికి భిన్నమైన ప్రతిని ఇరాన్‌కు పాక్ అందచేసి ఉండవచ్చని మిడిల్ ఈస్ట్ పత్రిక తెలిపింది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా పాక్ పేరును నేరుగా ప్రస్తావించకుండా అదే విధంగా సూచించినట్లు కనిపించింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ సంధానకర్తలను నమ్మించారని తెలిపారు. ఈ పరిణామాలు మధ్యవర్తిగా పాక్ పోషిస్తున్న పాత్రపై సందేహాలను పెంచాయి. కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనలను పాక్ సరిగ్గా తెలియచేయలేదని నిపుణులు ఆరోపించారు. కేవలం 24 గంటలు గడిచేసరికే కాల్పుల విరమణ ఒప్పందం సంక్లిష్టంగా మారింది. లెబనాన్ విషయంలో ఒప్పందం కుదిరిందని పాక్ చెబుతున్న దానికి, అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న వాదనకు మధ్య వ్యత్యాసం పాక్ మధ్యవర్తిత్వ ప్రక్రియలోని లోపాలను బయటపెట్టింది.