ఇస్లామాబాద్, మే 14: మోదీ ప్రభుత్వం విజ్ఞప్తులను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పట్టించుకోలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేయొద్దని కేంద్రం ఇటీవల ఐఎంఎఫ్‌ను కోరింది. పహల్గాం ఘటనను ఉదహరిస్తూ, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే ఈ విజ్ఞప్తి చేసినా ఐఎంఎఫ్ పట్టించుకోలేదు. బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
ఈ మేరకు బుధవారం ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్‌కు ‘ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్’ (ఈఎఫ్ఎఫ్) కింద 1.023 బిలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ. 8,738 కోట్లు) విడుదల చేసినట్టు తెలిపింది. పైగా తాము ఇచ్చే నిధులను పాకిస్థాన్ సక్రమంగా వినియోగిస్తున్నదని ఐఎంఎఫ్ సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. పాకిస్థాన్ జూన్ 2న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా నిధుల విడుదలపై ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నది.
ఈ మేరకు నిధులు విడుదల చేశామని, 16 తేదీ నాటికి విదేశీ మారక నిల్వల్లో ఈ నిధులు జమ అవుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈఎఫ్ఎఫ్ కింద పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతేడాది అంగీకరించింది. మొదటి విడుతగా గతేడాది బిలియన్ డాలర్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడుత నిధులు విడుదల చేసింది. ఐఎంఎఫ్‌లో సభ్యదేశం అయి ఉండీ, నిధులు విడుదల చేయకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.