హైదరాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ఓవైపు పాకిస్థాన్(Pakistan )వేదికగా చర్చలు జరుగుతుంటే మరోవైపు ఆదేశ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్(Khawaja Asif) చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో పాకిస్థాన్, ఇజ్రాయెల్(Israel) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన జలమార్గం మూసివేతపై దౌత్య చర్చలు చేపడుతున్న తరుణంలో అతడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్ లాంటిది అని లెబనాన్లో రక్తపాతం సృష్టిస్తున్నదని, అలాంటి దేశాన్ని సృష్టించిన వాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నట్లు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
దీంతో పాకిస్థాన్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మాటలను సహించదని ఆదేశాధ్యక్షుడు నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు నాయకత్వం వహిస్తున్న పాకిస్థాన్ నుంచి ఇలాంటి పరిణామాలు ఊహించలేదన్నారు. ఆదేశం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. కాగా, చర్చల వేళ ఇలాంటి పరిణామాలు ఎలాంటి అనిశ్చితికి దారి తీస్తాయోనని శాంతికాముకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.