ఇస్లామాబాద్: ఇస్లాం పేరుతో పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశారని, అయితే ఏ లక్ష్యంతో దేశాన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరనున్నట్లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అన్నారు. ఆదివారం లాహోర్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దార్ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. పాకిస్థాన్ ఏర్పాటుకు అల్లా ఓ చరిత్రాత్మక సందర్భాన్ని కల్పించారని, ఏ లక్ష్యంతో ఈ దేశాన్ని ఏర్పాటు చేశారో, ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.
ఇస్లాం పేరుమీద పాకిస్థాన్ దేశాన్ని సృష్టించారని, ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో పాకిస్థాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు మునీర్ చెప్పారు. పాక్ ప్రాముఖ్యత కూడా త్వరలో మరింత పెరగనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రమంగా పాకిస్థాన్ పరిస్థితి వృద్ధి చెందినట్లు మునీర్ తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బలపడిందని, ప్రపంచవ్యాప్తంగా పాక్ ర్యాంకు కూడా మెరుగుపడినట్లు ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తున్నదని, ఒకవేళ వ్యక్తిగతంగా ప్రశంసలు వస్తే అది అల్లా దీవెనగా భావిస్తానని, కానీ నిజానికి పాకిస్థాన్‌కు గుర్తింపు వస్తోందని, ఒక్క వ్యక్తికి కాదు అని ఆయన అన్నారు.
ఇటీవల అసిమ్ మునీర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఏర్పాటుకు పునాది టూ నేషన్ థియరీతో జరిగిందన్నారు. ముస్లింలు, హిందువుల మధ్య మౌళికమైన వ్యత్యాసాలు ఉన్నాయని, ఇండోపాక్ ఒక్కటి కాదు అని, వేర్వేరు దేశాలు అని, పాకిస్థాన్ ఏర్పాటుకు పునాది కల్మా అని, భవిష్యత్తు తరాలకు ఆ ఐడియాలజీని తీసుకెళ్లడం ముఖ్యమైందన్నారు.