Thailand | మాజీ ప్రధానమంత్రి (Prime Minister) తక్సిన్ షినవత్ర కుమార్తె పేటోంగ్టార్న్ (Paetongtarn Shinawatra) థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో.. 37 ఏళ్ల పేటోంగ్టార్న్ అభ్యర్థిత్వానికి పాలక ఫ్యూ థాయి పార్టీ నేతలు, సంకీర్ణ భాగస్వాములు గురువారం మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.
దీంతో థాయ్‌కి రెండో మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా షినవత్ర కుటుంబం నుంచి మూడో ప్రధానిగా, దేశంలో అతిపిన్న ప్రధానిగా కూడా పేటోంగ్టార్న్ రికార్డు సృష్టించారు. మొదట ఆమె తండ్రి తక్సిన్ (Thaksin Shinawatra), ఆ తర్వాత ఆమె బాబాయి యింగ్లక్ షినవత్ర ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. వారి తర్వాత ఆ కుటుంబం నుంచి తక్సిన్ కుమార్తె థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
కాగా, థాయ్‌లాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ప్రధాన ప్రతిపక్షాన్ని వారం రోజుల క్రితమే రద్దు చేసిన రాజ్యాంగ న్యాయస్థానం ఇప్పుడు మరో సంచలన తీర్పును ప్రకటించింది. ఒక కేసులో శిక్షపడిన పిచిట్ అనే వ్యక్తిని స్రెట్టా థావిసిన్ తన క్యాబినెట్ సభ్యుడిగా నియమించడంపై విచారించిన రాజ్యాంగ న్యాయస్థానం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. ఆయన తక్షణం తన కార్యాలయాన్ని వదిలివెళ్లాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో ఆయన పదవీచ్యుతుడయ్యారు.
Also Read..
Mpox | పాకిస్థాన్‌లో తొలి ఎంపాక్స్ కేసు నమోదు.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
Kolkata murder | ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా.. రేపు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేత