Mpox | ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్’ (Mpox) వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మందికిపైగా మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. తాజాగా ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా బయట దేశాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా పాకిస్థాన్ (Pakistan)లో తొలి ఎంపాక్స్ కేసు బయటపడింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఆరోగ్య శాఖను ఊటంకిస్తూ పాకిస్థాన్ మీడియా తాజాగా వెల్లడించింది. 34 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియా నుంచి ఆగస్టు 3వ తేదీన పాకిస్థాన్‌కు వచ్చాడు. అయితే, అతడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు అతడు మంకీపాక్స్ బారినపడినట్లు పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ ధ్రువీకరించింది.
స్వీడన్‌లోనూ తొలి కేసు..
మరోవైపు నిన్న స్వీడన్ (Sweden)లో కూడా తొలి ఎంపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజధాని స్టాక్‌హోమ్‌కు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్లేడ్ 1 రకానికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడటం ఇదే తొలిసారి అని స్వీడన్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది. కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ప్రకటించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ రెండు (పాకిస్థాన్, స్వీడన్) దేశాల్లో కొత్త కేసులు వెలులు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్..
మరోవైపు ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్’ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన విషయం తెలిసిందే. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీచేసింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ, ‘ఎమర్జెన్సీ కమిటీ సూచన మేరకు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాం’ అని అన్నారు. వ్యాధి సోకితే తీవ్రమైన కండరాల నొప్పి, జ్వరం వస్తాయి.
Also Read..
Kolkata murder | ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా.. రేపు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేత
KTR | ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. ఇస్రో బృందానికి కేటీఆర్ శుభాకాంక్షలు..