న్యూఢిల్లీ: ఇరాన్‌లోని మూడు అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికాకు చెందిన ఆరు బంకర్ బస్టర్ బాంబులు దాడి చేసిన తర్వాత ఆచూకీ తెలియకుండా పోయిన 400 కిలోల యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యురేనియం నిల్వలతో 10 అణు బాంబులను తయారు చేయవచ్చని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. నూతన అణ్వస్త్ర ఒప్పందంపై అమెరికాతో చర్చలు పునరుద్ధరించే సందర్భం వచ్చినపుడు మాయమైన యురేనియం నిల్వలను బూచిగా చూపించి ఇరాన్ తన షరతులను ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 60% శుద్ధి చేసిన ఈ నిల్వలను దాదాపు 90% శుద్ధి చేసిన తర్వాత అణ్వస్ర్తాలకు ఉపయోగించవచ్చు.
అమెరికా బాంబులు వేయడానికి ముందే యురేనియం నిల్వలతోపాటు కొన్ని పరికరాలను వేరే రహస్య ప్రదేశానికి తరలించి ఉంటుందని ఇజ్రాయెలీ అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్ అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఈ దాడి జరగడానికి ముందు తీసిన ఉపగ్రహ చిత్రాలలో భూగర్భ ఫోర్డో అణు కేంద్రం వెలుపల వరుసగా నిలిపి ఉన్న 16 ట్రక్కులు కనిపించాయి.
బాంబు దాడి తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలలో మూడు అణు కేంద్రాల వెలుపల విధ్వంసం జరిగినట్లు కనిపిస్తుండగా ట్రక్కులు మాత్రం మాయమయ్యాయి. అయితే ఈ ట్రక్కులలో వేటిని తరలించారు, ఎక్కడకు తరలించారు స్పష్టం కానప్పటికీ ఇస్ఫాహన్ సమీపంలో ఉన్న మరో భూగర్భ స్థావరానికి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.