వాషింగ్టన్, మే 16: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం ముంచుకొచ్చేలా ఉన్నది. వచ్చే వారం అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నట్టు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు పేర్కొన్నాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన క్రమంలో ఇరాన్‌పై దాడులు పునరుద్ధరించేందుకు అమెరికా మిలిటరీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం పేర్కొన్నది. ఇజ్రాయెల్ కూడా వచ్చే వారం ఇరాన్‌పై దాడులు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
ఒక వైపు నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ఉండటం, మరో పక్క ఇరాన్‌తో యుద్ధం కారణంగా దేశంలో రోజురోజుకూ దిగజారుతున్న ప్రతిష్ఠ, యుద్ధానికి అయ్యే భారీ వ్యయ భారం సామాన్య అమెరికా పౌరులపై పడటం ఆయన పాలనా సామర్థ్యానికి ప్రతికూలంగా మారాయి. ఇరాన్‌తో హొర్ముజ్ జలసంధిపై రాజీ చేసుకుని తద్వారా తనను తాను విజేతగా ప్రకటించుకునేలా ఒక రాజీకి రావాలంటూ మిత్రపక్షాలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నాయి. రోజురోజుకూ యుద్ధానికి అవుతున్న బిలియన్ డాలర్ల వ్యయం ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
పశ్చిమాసియా సంక్షోభంలో చైనా పటిష్ఠ మధ్యవర్తిత్వ పాత్ర పోషించవచ్చునని ట్రంప్ ఆ దేశ పర్యటనకు ముందు పలువురు ఊహించారు. అయితే ఇరు దేశాల నేతల మధ్య చర్చలైతే జరిగాయి తప్ప, ఆ మేరకు ఎలాంటి ప్రయత్నం జరగ లేదు. హొర్ముజ్ జలసంధి సంక్షోభం గురించి ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో కూడా చైనా తన సొంత ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే హొర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు సామర్థ్యం విషయంలో మాత్రం రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
దీంతో డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల చైనా పర్యటన ముగించుకుని వచ్చిన క్రమంలో ఇరాన్‌పై మిలిటరీ చర్యలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మళ్లీ దాడులను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై ట్రంప్ ఇంకా నిర్ణయంతీసుకోలేదని ఆయన సన్నిహితులను ఉటంకిస్తూ న్యూయార్ట్ టైమ్స్ తెలిపింది. ఇరాన్‌ను అణు రహితంగా మార్చే లక్ష్యంలో అమెరికా విఫలమైన క్రమంలో ఈసారి చేపట్టే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పెంటగాన్ కూడా కొద్ది రోజుల్లో దీన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు ఎన్‌వైటీ తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి వచ్చే వారం మరోసారి ఇరాన్‌పై దాడులను పునరుద్ధరించాలని ప్రయత్నాలు ప్రారంభించాయని పశ్చిమాసియాకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘వారు మాతో డీల్ కుదుర్చుకోవడమో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమో జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా మేం గెలుస్తాం’ అని చైనా వెళ్లే ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి ఇరాన్‌పై దాడిని సూచిస్తున్నాయి. మరోసారి దాడులకు కనుక ట్రంప్ పచ్చజెండా ఊపితే ఇరాన్ మిలిటరీ, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా భారీ బలగాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా సైనిక అధికారులు ప్రకటించారు. ఇక ఇరాన్ మెడలు వంచడానికి అమెరికా ముందు ప్రస్తుతం మూడు మార్గాలు కనిసిస్తున్నాయి.
ఒకటి మళ్లీ ఆ దేశ మౌలిక సౌకర్యాలపై దాడులు చేయడం, రెండు.. ప్రత్యేక దళాలను ఇరాన్ గడ్డపై దింపి, భూమి లోపల లోతుగా దాచి ఉంచిన అణుసామగ్రిని ధ్వంసం చేయడం. అయితే ఇది అంత సులభమైనదేమీ కాదు. దీని కోసం వేలాది మంది బలగాలు, నిపుణులు కావాలి. ఇరాన్ బలగాలను ఎదుర్కోవాలి. ఈ క్రమంలో అమెరికాకు పెద్దయెత్తున ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నది. మూడో మార్గం అమెరికా తన బలగాలను ప్రయోగించి ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం. అయితే దీన్ని నిలబెట్టుకోవడానికి పెద్దయెత్తున సైనికులు అవసరమవుతారు. తద్వారా రెండు వర్గాల మధ్య సంఘర్షణ, వ్యయం కూడా అధికమవుతాయి.
అమెరికాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. తప్పుడు వ్యూహాలు, తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తప్పుడు ఫలితాలనే ఇస్తాయని ఇరాన్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబఫ్ పేర్కొన్నారు. ‘ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి మా సైన్యం సిద్ధంగా ఉన్నది. మా దాడులతో అమెరికాను ఆశ్చర్యపరుస్తాం’ అని ఆయన అన్నారు. కాగా, కాల్పుల విరమణ సమయంలో యుద్ధపరంగా ఇరాన్ పుంజుకుందని, తన క్షిపణి మౌలిక సదుపాయాలు, ప్రయోగ ప్రదేశాలు, అండర్‌గ్రౌండ్ సౌకర్యాలను బాగా మెరుగుపరుచుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధి వెంబడి ఉన్న 33 క్షిపణి కేంద్రాల్లో 30 తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుందని అధికారులు తెలిపారు.