వాషింగ్టన్: ఒక క్రూయిజ్ షిప్లో 300 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయితే వారి అనారోగ్యానికి కారణం ఏమిటన్నది (Mysterious Illness) అంతుపట్టలేదు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ సంస్థకు చెందిన రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికో వెళ్లి తిరిగి వచ్చింది. అయితే ఆ ఓడలో ప్రయాణించిన వారితోపాటు సిబ్బంది కూడా గుర్తు తెలియని అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 2,881 మంది ప్రయాణికుల్లో పది శాతం మేర అనగా 284 మంది అనారోగ్యం పాలయ్యారు. అలాగే 1,159 మంది సిబ్బందిలో మూడు శాతం మేర అనగా 34 మంది అస్వస్థత చెందారు.
కాగా, మార్చి 5న టెక్సాస్‌లోని గాల్వెస్టన్కు క్రూయిజ్ షిప్ చేరింది. దీంతో ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కు రిపోర్ట్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రధానంగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో షిప్లో తరచుగా శుభ్రత ప్రక్రియలను చేపట్టడంతోపాటు క్రిమిసంహారక పద్ధతులు పాటించినట్లు పేర్కొన్నారు. అనారోగ్యాన్ని గుర్తించలేక పోవడంతో సీడీసీ పరిశీలన కోసం రోగుల నుంచి నమూనాలు సేకరించినట్లు వెల్లడించారు.
మరోవైపు రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2020లో కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఓడలోని వందల మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ క్రూయిజ్ షిప్‌ను ఆస్ట్రేలియాలో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య సంస్థ అయిన సీడీసీ ఇటీవల వరకు క్రూయిజ్ షిప్‌లలో కరోనా వ్యాప్తిపై దృష్టిసారించింది. అయితే కరోనా తగ్గడంతో 2022 జూలై నుంచి వైరస్ కేసుల ట్రాకింగ్ ప్రక్రియను ముగించింది.