Oil Prices : హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, కొరత వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచానికి ఇప్పుడు మరింత షాక్ తగలనుంది. చమరు ధరలు వరుసగా పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని మరింత మూసివేస్తామన్న అమెరికా ప్రకటనతో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లుగా ఉంది.
బుధవారం ఒక్క రోజే అంతర్జాతీయంగా చమురు ధరలు 0.63 శాతం పెరిగి 111.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 0.81 శాతం పెరిగి 100.74 డాలర్లకు చేరింది. ఇరాన్ ఎగుమతులపై దీర్ఘకాలిక ఆంక్షల కారణంగా చమురు మార్కెట్లో ధరల పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జలసంధిని పూర్తిగా మూసి వేయడంతోపాటు ఇరాన్ పోర్లుల్ని కూడా మూసివేస్తామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముగింపు పలికేలా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో అమెరికా ఈ పని చేస్తోంది. అయితే, ఇరాన్ పోర్టుల్ని అడ్డుకుంటే, ఇప్పటికే తక్కువ స్థాయిలో ఉన్న చమురు సరఫరా ఇంకా క్షీణిస్తుంది.
దీంతో ధరలు మరింత పెరుగుతాయి. అమెరికా చర్య ఎక్కువ కాలం అమలైతే ప్రపంచానికి మరింత సంక్షోభం తప్పదు. ప్రపంచ చమురు రవాణాలో హార్ముజ్ అత్యంత కీలకం. ఐదో వంతు చమురు, ఎల్పీజీ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గాన్ని ఇరాన్ మూసేసింది. ఇండియాకు సంబంధించి ఎంసీఎక్స్ వద్ద చమురు ధరలు తక్కువగానే ఉన్నాయి. క్రూడాయిల్ ధర 0.88 శాతం తగ్గి, రూ.9,401 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు ఒపెక్ సభ్యత్వం నుంచి తప్పుకొంటున్నట్లు యూఏఈ చేసిన ప్రకటన కూడా చమురు ధరల పెరుగుదలకు, అస్థిరతకు కారణమవుతుంది. ఇరాన్–అమెరికా సంక్షోభం ముగిస్తేనే.. చమురు ధరలు అందుబాటులోకి వస్తాయి.