సియోల్, నవంబర్ 17: తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలిసింది. దశలవారీగా వీరిని పంపనున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్యాకు 15 వేల మంది ఉత్తరకొరియా సైనికులకు కిమ్ పంపారు. దీనిపై పొరుగుదేశమైన దక్షిణ కొరియా, అమెరికా అభ్యంతరాలు చెప్తున్నా ఆయన లెక్కచేయడం లేదు. కిమ్ చర్యలతో ఉక్రెయిన్, మిత్రదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఈ చర్య ఇండో పసిఫిక్ రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
దక్షిణ కొరియాలో సరిహద్దు గ్రామమైన డాంగ్సన్ ప్రజలు పొరుగుదేశం దాడులకు భీతావహులవుతున్నారు. ఇంతకీ వారు ఎదుర్కొంటున్నది తుపాకి దాడులో, బాంబు దాడులో కాదు. శబ్ద దాడులు. వినడానికి ఇది ఆశ్చర్యకరంగా ఉన్న పొరుగున ఉన్న ఉత్తర కొరియా నుంచి వస్తున్న అతి తీవ్ర శబ్దాలకు వీరి కర్ణభేరీలు పగిలపోతున్నాయి. బాబోయ్ ఈ శబ్దం భరించలేం అంటూ ఇంటి తలుపులు తీసి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ‘సౌండ్ బాంబింగ్’తో వినూత్న తరహాలో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా బాంబులు, మెటాలిక్ గ్రైండింగ్, ఫిరంగుల శబ్దాలను రికార్డు చేసి వాటిని భారీ లౌడ్‌స్పీకర్ల ద్వారా సరిహద్దు గ్రామమైన డాంగ్సన్ ప్రజలకు వినిపిస్తున్నారు. ఇటీవల చెత్త బెలూన్ల దాడితో హడలెత్తించిన కిమ్ ఈ విధంగా మరో దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. ఈ భారీ శబ్దాలతో తాము ఈ ఏడాది జూలై నుంచి తీవ్ర నిద్రలేమితో పాటు తలనొప్పి, ఒత్తిడితో బాధపడుతున్నామని, తమ గ్రామంలోని జంతువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వారు వాపోయారు. బాంబులు వేయకుండానే వారు విధ్వంసం సృష్టిస్తున్నారని ఒక గ్రామస్తుడు వాపోయాడు. తమ గ్రామంలో అతి తక్కువ మంది జనాభా ఉన్నారని, అందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, అందుకే తమ బాధను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించాడు.