Korean War | సియోల్, అక్టోబర్ 17: కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
దక్షిణ కొరియా సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే ఒకవైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ – లెబనాన్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొరియాలోనూ యుద్ధం ముంచుకొచ్చే పరిస్థితులు కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఉత్తర కొరియాకు చైనా, రష్యాతో సంబంధాలు ఉండటం, దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఉండటంతో ఇరు కొరియా దేశాల మధ్య యుద్ధం తలెత్తితే పర్యవసానాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.
యుద్ధ సన్నాహాల్లో ఉత్తర కొరియా!
ఉత్తర కొరియాను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గత వారం రోజుల్లో 14 లక్షల మంది యువత తమ ఆర్మీలో చేరారని ఆ దేశం ప్రకటించింది. రెండు రోజుల్లోనే 10 లక్షల మంది స్వచ్ఛందంగానే సైన్యంలో చేరారని చెప్పింది. దీనికి సంబంధించిన చిత్రాలను ఆ దేశ మీడియా విడుదల కూడా చేసింది. మరోవైపు దక్షిణ కొరియాను శత్రుదేశంగా పేర్కొంటూ ఏకంగా రాజ్యాంగ సవరణ చేసింది.
‘ఉత్తర కొరియా రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా, అనివార్యమైన, చట్టబద్ధమైన చర్య ఇది’ అంటూ కిమ్ ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకుంది. దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా ఈ ఏడాది జనవరిలో కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించగా, ఇందుకు అనుగుణంగా ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైలు మార్గాలను సైతం ఉత్తర కొరియా పేల్చేస్తున్నది. అణ్వాయుధాల్లో కీలకమైన యురేనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సైతం గత నెల అధికారులకు కిమ్ ఆదేశాలు ఇచ్చారు. అణ్వాయుధ సంపత్తిని పెంచాలని ఆయన సూచించారు.
ఏడు దశాబ్దాలుగా ఉద్రిక్తతలే
ఇరు కొరియా దేశాల మధ్య ఏడు దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 1910 నుంచి 1945 వరకు జపాన్ ఆధీనంలో ఉమ్మడి కొరియా ఉండేది. 1945లో రెండుగా విడిపోయి సోవియెట్, చైనా కమ్యూనిస్టుల సాయంతో ఉత్తర కొరియా, అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా ఏర్పడ్డాయి. 1950లో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా యుద్ధానికి దిగగా, దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఇచ్చింది. మూడేండ్ల పాటు యుద్ధం కొనసాగిన అనంతరం ఇరు దేశాల మధ్య స్పష్టమైన భౌగోళిక విభజన జరిగింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం మాత్రం జరగలేదు.
తర్వాత తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇవి మరింత పెరిగాయి. ఇంతకాలం ఇరు దేశాలను కలపాలని భావించిన కిమ్ జోంగ్ ఉన్.. తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు, రెండు దేశాలు కలిసే ప్రసక్తే లేదని ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొత్త కాకపోయినా ప్రస్తుత పరిణామాలు 1950 నాటి యుద్ధ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తన పాలనపై విధేయతను దృఢపరుచుకునేందుకు ఉద్రిక్తతలను పెంచడం కూడా కిమ్ జోంగ్ ఉన్‌కు అలవాటేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అణుబాంబు తయారీ దిశగా దక్షిణ కొరియా?
ఉత్తర కొరియా యుద్ధ సన్నాహాల్లో ఉండటంతో యుద్ధం తలెత్తినా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా సిద్ధమవుతున్నది. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై ఆందోళన చెందుతున్న దక్షిణ కొరియా సైతం అణు బాంబుల తయారీ దిశగా అడుగులు వేస్తున్నది. అణు ఇంధనాన్ని రీప్రాసెస్ చేయటం కోసం అమెరికా సాయం పొందేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. రీప్రాసెస్ చేసిన అణు ఇంధనంతో అణు బాంబు తయారుచేయాలన్నదే దక్షిణ కొరియా ఆలోచనగా యుద్ధ నిపుణులు పేర్కొన్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే దక్షిణ కొరియా మూడు నుంచి ఆరు నెలల్లో అణు బాంబును సిద్ధం చేస్తుందని అంచనా వేస్తున్నారు.