టెహ్రాన్: అమెరికా – ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది. దీనికి ముందు పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతున్న ఘర్షణను ముగించే శాంతి ఒప్పంద ముసాయిదాపై అమెరికా, ఇరాన్‌లు ఏకాభిప్రాయానికి వచ్చాయని, తుది ఒప్పంద పాఠం ఖరారైందని పాకిస్థాన్ ప్రధాని షెహబాద్ షరీఫ్ తెలిపినట్లు ‘రాయిటర్స్’ నివేదించింది. అలాగే రాబోయే 24 గంటల్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు చేయడానికి పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోందని కూడా షరీఫ్ పేర్కొన్నారు.
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం చెప్పినట్లు ఆక్సియోస్ వార్తాసంస్థ శనివారం తెలిపింది. నెతన్యాహుకు ఫోన్ చేసిన ట్రంప్ అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న ఒప్పందాన్ని గొప్ప ఒప్పందంగా అభివర్ణించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ ఆక్సియోస్ పేర్కొంది. ఇదే ఆ ఒప్పందం. ఇదో గొప్ప ఒప్పందం. ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఆ ఒప్పందంలో తప్పక ప్రస్తావించాలని ఆందోళన వ్యక్తం చేసిన నెతన్యాహు అమెరికా అధ్యక్షుడితో పెద్దగా వాదనకు దిగలేదని ఆ అధికారి చెప్పారు. ఇక ఒప్పందం జరగడం ఖాయమని, దాన్ని తాను అడ్డుకోలేనని బీబీ(నెతన్యాహు) గ్రహించి ఉంటారని ఆ అధికారి అన్నారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నెతన్యాహు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఓ ఉన్నతస్థాయి వర్గం ఆక్సియోస్‌కు తెలిపింది.
భారత నావికా సిబ్బందితో వస్తున్న లియాకీ ఫ్రీడమ్ నౌకపై సైనిక దాడి జరిగినట్టు వస్తున్న వార్తలను శుక్రవారం భారత విదేశాంగ శాఖ ఖండించింది. అందులోని నావికా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ధ్రువీకరించింది. లియాకీ ఫ్రీడమ్ నౌక మాస్టర్‌తో మాట్లాడామని, అందులోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, దానిపై దాడి జరిగినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి తెలిపారు.
హోర్ముజ్ జలసంధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై జరిగిన డ్రోన్ దాడి వెనుక ఇరాన్ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తిరస్కరించింది. ఈ ఆరోపణలను నిరాధారం అని కొట్టి పారేసింది.అమెరికా మూడు భారతీయ నౌకలపై దాడులు చేసి, ముగ్గురు భారతీయ నావికులను పొట్టన పెట్టుకున్నదని పేర్కొన్నది.