Donald Trump : అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుండా ఆలస్యం చేస్తున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తాను మంచిగా ఉండబోనంటూ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా తన ప్రత్యేక ఫొటోను పంచుకున్నారు. దానిపై ‘నో మోర్ మిస్టర్ నైస్ గై’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే, ఇకపై తాను మంచివాడికి కాను అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఇరాన్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని, అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలన్నారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందని, అణు ఒప్పందం విషయంలో ఎలా వ్యవహరించాలో వారికి తెలియడం లేదని ట్రంప్ అన్నారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌కు కొత్త ప్రతిపాదనలు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. వాటిని అంగీకరించాలని సూచించారు. ఇరాన్–అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ చర్చలు మాత్రం కొనసాగడం లేదు.
అణు ఒప్పందం అంశంలో ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధించింది. ఈ జలసంధి నుంచి నౌకల రవాణాను ఇరాన్ కూడా అడ్డుకుంటోంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి, హార్ముజ్ జలసంధి తెరుచుకోవాలని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మద్దతు కోరేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది.