లండన్ : ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తే! 15 రకాల క్యాన్సర్లకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించే వ్యాక్సిన్ ఇంగ్లండ్‌లో అందుబాటులోకి రాబోతున్నది. వచ్చే నెల నుంచి ఈ వ్యాక్సిన్‌ను రోగులకు ఇవ్వబోతున్నట్టు ఇంగ్లండ్‌లోని ‘జాతీయ ఆరోగ్య సేవల విభాగం’ (ఎన్హెచ్ఎస్) తాజాగా ప్రకటించింది. సైంటిస్టులు అభివృద్ధి చేసిన ‘నివోల్యుమాబ్’ వినియోగానికి సంబంధించి బ్రిటన్ ఔషధ నియంత్రణ మండలి (ఎంహెచ్ఆర్ఏ) బుధవారం ఆమోదం తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయట. 15 రకాల క్యాన్సర్లకు ఒకే వ్యాక్సిన్‌తో, కొన్ని నిమిషాల్లో చికిత్స అందించటం దీంట్లో ప్రత్యేకత.
వ్యాక్సిన్‌లోని ఔషధం ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. శరీరంలోని రోగ నిరోధక కణంపై ప్రొటీన్ (పీడీ-1)కు అతుక్కుపోవటం ద్వారా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను వెతికి నాశనం చేయడానికి, క్యాన్సర్ కణాలను అడ్డుకోవడానికి యాంటీబాడీ అనుమతిస్తుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ రకాలైన ఔషధాల్ని ఐవీ రూపంలో అందజేస్తున్నారు. స్లైన్ ద్వారా లేదా ఇంజెక్షన్‌ను చేతి నరానికి గుచ్చి.. ఔషధాన్ని నెమ్మదిగా శరీరంలోకి ఎక్కిస్తారు. క్లినిక్స్‌లో గంటకుపైగా సమయం పడుతుంది. అంతేగాక ప్రతి నెలా రెండు సార్లు క్లినిక్‌కు రావాల్సి ఉంటుంది.