న్యూఢిల్లీ, జూన్ 20 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో చేతులు కలిపినా కలపకున్నా ఇరాన్‌లోని అణు స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఫోర్డోలోని భూగర్భ అణు స్థావరంతో సహా ఇరానియన్ స్థావరాలపై దాడి చేసే ముందు అమెరికా నుంచి అనుమతి కోసం ఎదురు చూడబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తమ చేరికపై అమెరికా నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మా లక్ష్యాలన్నిటినీ సాధిస్తాం. ఇరాన్‌లోని అన్ని అణు స్థావరాలపై దాడి చేస్తాం. అందుకు అవసరమైన సత్తా మాకు ఉంది అని నెతన్యాహు తెలిపారు.