న్యూఢిల్లీ: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ(John Kerry) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ అనేకసార్లు వత్తిడి చేసినట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షులపైన కూడా గతంలో ఒత్తిడి జరిగినట్లు ఆయన చెప్పారు. కానీ నెతన్యహూ ప్రెజర్‌కు ట్రంప్ ఒక్కరూ ఒప్పుకున్నారని తెలిపారు. ద బ్రీఫింగ్ విత్ జెన్ సాకికి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యహూతో అనేక సార్లు చర్చలు జరిపానని, ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాపై వత్తిడి తెచ్చేవారని, ఇరాన్‌పై మిలిటరీ చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరేవారన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయాలన్న ఆకాంక్ష నెతన్యహూలో ఉన్నట్లు కెర్రీ పేర్కొన్నారు.
ఇరాన్‌పై దాడి అంశం గురించి గతంలో మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామాతోనూ నెతన్యహూ నేరుగా చర్చించినట్లు చెప్పారు. కానీ ఆ ప్రతిపాదనను ఒబామా వ్యతిరేకించినట్లు కెర్రీ తెలిపారు. ఒబామా తిరస్కరించారు.. జో బైడెన్ తిరస్కరించారు.. ప్రెసిడెంట్ జార్జ్ బుష్ తిరస్కరించారు.. కేవలం ఒక్క ప్రెసిడెంట్ మాత్రమే అంగీకరించారని, ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రమే ఇరాన్‌పై అటాక్ చేసినట్లు కెర్రీ తెలిపారు. ఇరానీ ముఖ్య నేతలను హతమార్చి, అధికార మార్పిడి చేసి, ఇరాన్ మిలిటరీని ధ్వంసం చేయాలన్న ఆలోచన నెతన్యహూకు ఉన్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఇజ్రాయెల్ , అమెరికా అధికారులతో జరిగిన చర్చల సమయంలో నెతన్యహూ ఇవే ప్రతిపాదనలు చేసినట్లు కెర్రీ పేర్కొన్నారు.