LTTE Prabhakaran | ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా ఉన్నారు. తమిళనాడు కాంగ్రెస్ మాజీ నాయకుడు, వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ తమిళ్ పజా నేత నెడుమారన్ ఈ వాదన చేశారు. ప్రభాకరన్ చనిపోయాడన్న ప్రకటన పూర్తిగా అబద్ధమని, తాను సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తనతో చెప్పారన్నారు. పాలా కోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్‌కు సంబంధించి ఈ సంచలన సమాచారాన్ని వెల్లడించారు.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ చనిపోలేదని తమిళ పజా నెడుమారన్ చెప్పారు. ఆయన చనిపోయినట్లు వచ్చిన ప్రకటన శుద్ధ అబద్ధమన్నారు. ఆరోగ్యంగా ఉన్నానని ఆయనే తనతో చెప్పారని వెల్లడించారు. ఆయనే స్వయంగా చెప్పడంతో చనిపోయాడన్న పుకార్లకు తెరపడుతుందని నమ్ముతున్నామన్నారు. త్వరలో ప్రభాకరన్ ప్రపంచం ముందుకు వస్తాడని కూడా తెలిపారు. ప్రభాకరన్ నేతృత్వంలోనే మళ్లీ ఈలం యుద్ధం ప్రారంభమవుతుందని కూడా చెప్పారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం 2009 మే 18న ప్రకటించింది. శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న శ్రీలంక సైనికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలో జరిగిన కాల్పుల్లో అతడి చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వారం రోజుల తర్వాత ఎల్టీటీఈ ప్రతినిధి సెల్వరాస పద్మనాథన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు వారాల తర్వాత డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్, అతడి కుమారుడు ఆంథోనీ చార్లెస్ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. కాగా, ప్రభాకరన్ మరణించాడన్న వార్తను భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు.