కిన్షాస (కాంగో), ఫిబ్రవరి 26: కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
అనంతరం ఈ వ్యాధి విస్తరించి పలువురు మరణించారు. మొదట జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు కన్పించే ఈ వ్యాధి బారిన పడ్డవారిలో చాలా మంది 48 గంటల్లోనే మృతి చెందుతున్నారు. దేశంలో 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు. తొలత బొలోకో అనే గ్రామంలో జనవరిలో ఈ వ్యాధి బయటపడింది.