న్యూఢిల్లీ, జూన్ 8: రెండు నెలల క్రితం అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మొదటిసారి సోమవారం తెల్లవారుజామున ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు జరుపుకొన్నాయి. శాంతి చర్చల్లో స్పష్టమైన పురోగతి కనబడకపోవడం, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం కాల్పులు జరుపుకోవడం, హౌతీలు కూడా పోరాటంలో చేరడంతో కాల్పుల విరమణ తర్వాత ఎన్నడూ లేనంతగా యుద్ధం మళ్లీ పూర్తిస్థాయిలో చెలరేగే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నది. మళ్లీ కాల్పులు ప్రారంభమైన దరిమిలా అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందిస్తూ ఇజ్రాయెల్, ఇరాన్ తక్షణమే కాల్పులు ఆపాలని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆదేశించారు.
సీజ్‌ఫైర్‌ను కాపాడేందుకు..
ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణను కాపాడేందుకు సోమవారం సమన్వయ దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇద్ద రు ప్రాంతీయ అధికారులు తెలిపారు. ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ తన దాడులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వాన్ని ఈజిస్టు, సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్, ఖతార్‌కు చెందిన అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులను ఆపాలని ఇరాన్‌ను కూడా వారు అర్థించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సోమవారం వరుస దాడులు జరుపగా మధ్య, పశ్చిమ ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ప్రారంభమైన నాటి నుంచి ఇవే మొదటి కాల్పులు. ఇస్ఫహాన్, కరజ్, తహ్రీజ్, టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. ఇజ్రాయెలీ దాడి తర్వాత టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. ఖుజెస్థాన్ ప్రావిన్సులో మహషాహర్ నగరంలోని పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడులు జరిపిందని ఇరాన్ ప్రభుత్వ పాక్షిక యాజమాన్యంలోని మెహర్ న్యూస్ తెలిపింది. అయితే జరిగిన నష్టం వివరాలను వెల్లడించలేదు.
కాగా, పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడి జరిపినట్లు ఇజ్రాయెలీ సైన్యం తర్వాత ధృవీకరించింది. ట్రక్కు మీద ఉన్న క్షిపణి లాంచర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొన్నది. ఇరానియన్ క్షిపణి దాడికి ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా బీరుట్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఆదివారం ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేయడంతో ఇరాన్ కూడా కాల్పులు జరిపింది. ఇజ్రాయెల్‌లో రెండు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డు తెలిపింది. ఇరాన్లో మూడు ప్రాంతాల్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారమే తమ ఈ దాడులని గార్డు పేర్కొన్నది. ఇరాన్ నుంచి వస్తున్న కాల్పులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలు ప్రయత్నించడంతో మధ్య ఇజ్రాయెల్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. మళ్లీ కాల్పులు చెలరేగడానికి అమెరికానే బాధ్యత వహించాలని ఇరాన్ నిందించింది.
ట్రంప్-నెతన్యాహు విభేదాలు
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యంత సమన్వయంతో ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ, తొలి దాడులు జరిగినప్పటి నుంచి ఆ ఇద్దరు నాయకుల మధ్య ఉద్రిక్తతలు ఆదివారంబహిరంగంగా బయటపడ్డాయి. ఆదివారం బీరుట్లో జరిగిన దాడి, ఆ తర్వాత ఇరాన్‌పై జరిపిన దాడులతో నెతన్యాహు ట్రంప్‌ను బహిరంగంగా ధిక్కరించినట్లు కనిపిస్తుండగా ట్రంప్ ఇజ్రాయెల్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను అని ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు. సోమవారం జరిగిన ఇజ్రాయెల్ దాడులను పేర్కొంటూ అవి అమెరికా సమన్వయంతో జరిగాయా లేదా అనే విషయంపై పంపిన సందేశాలకు వైట్ హౌస్ స్పందించలేదు.