Mohamed Muizzu : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల (Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాల్దీవులు ప్రభుత్వం కూడా నోరుజారిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ తరుణంలో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) చైనా (China) పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
మహ్మద్ మయిజ్జు తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి చైనాకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆహ్వానం మేరకే మయిజ్జు చైనాలో ఐదు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. భారత్‌తో దౌత్యపరమైన వివాదం నెలకొన్న తరుణంలో ఈ పర్యటన జరుగుతుండటం గమనార్హం. మయిజ్జు కొద్ది నెలల క్రితమే మాల్దీవులు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
మయిజ్జుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా ఆయన చైనాకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరుదేశాల అధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపి, పరస్పర సహకారం కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ద్వీప దేశంలో సందర్శకుల సంఖ్యను పెంచడం ఈ పర్యటన లక్ష్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.