శాన్ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 6: అమెరికాలో ప్రతిపాదించిన నూతన మీడియా బిల్లుపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఈ బిల్లును అమెరికా పార్లమెంట్ ఆమోదిస్తే తమ ప్లాట్ఫామ్ నుంచి అమెరికా వార్తలను తొలగిస్తామని మెటా హెచ్చరించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే అక్కడి మీడియా సంస్థలు తమ కంటెంట్ ఫీజు విషయమై ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలతో గట్టిగా బేరమాడేందుకు అవకాశం లభిస్తుంది.
కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న స్థానిక వార్తా సంస్థలను ఆదుకొనేందుకు జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ (జేసీపీఏ)ను వార్షిక డిఫెన్స్ బిల్లుకు జత చేయాలని అమెరికన్ పార్లమెంటేరియన్లు కోరుతున్నట్టు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ వెల్లడించింది. నిరుడు ఆస్ట్రేలియా కూడా ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టడంతో ఫేస్బుక్ కొంత కాలంపాటు ఆస్ట్రేలియా వార్తలను సస్పెండ్ చేసింది. ఇప్పుడు అమెరికాలోనూ ఇలాంటి చట్టాన్నే తీసుకురావడంపై పార్లమెంట్ పరిశీలన జరుపుతున్నది.