వాషింగ్టన్, మే 21: ఏఐ (కృత్రిమ మేధస్సు) సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఏడాదిలో మరికొంత మందిని తొలగించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
అయితే ఈ ఏడాది మరిన్ని లేఆఫ్‌లు ఉండకపోవచ్చని ఉద్యోగులకు పంపిన మెయిల్లో సీఈవో జుకర్‌బర్గ్ వెల్లడించారు. ‘ఏఐ మన జీవితంలో అత్యంత ప్రభావం చూపించే సాంకేతికత. ఆ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే సంస్థలే తర్వాత తరానికి ఒక మార్గం చూపిస్తాయి. ఈ కంపెనీ అభివృద్ధిలో భాగమైన వారికి గుడ్‌బై చెప్పటం బాధించే విషయమే’ అని అన్నారు.
యూరప్, అమెరికా, సింగపూర్లలో కొందరు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ చేసే అవకాశం కల్పించి.. అంతలోనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ‘ఈ-మెయిల్’ ద్వారా సమాచారాన్ని మెటా పంపింది. అదే సమయంలో వారికి ఎంతమేర ప్యాకేజీ ఇస్తున్నారన్న దానిపైనా చర్చ మొదలైంది.
అమెరికాలో లేఆఫ్ అయిన ఉద్యోగికి 16 వారాలకు సమానమైన బేస్ పేతో పాటు ఉద్యోగంలో కొనసాగిన ప్రతి ఏడాదికి రెండు వారాల వేతనాన్ని అందిస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ ఉద్యోగితోపాటు ఆ కుటుంబానికి 18 నెలల హెల్త్‌కేర్ కవరేజ్ అందుతుంది. అమెరికా వెలుపల ఉద్యోగం కోల్పోయిన వారికి కొంత అటూఇటుగా ఇదే ప్యాకేజీ మెటా చెల్లిస్తున్నట్టు తెలిసింది.