మాస్కో: మెలిటోపోల్ నగరాన్ని సంపూర్ణంగా చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రణభేరి మోగించిన రష్యా.. మూడవ రోజు కూడా తన దాడుల్ని కొనసాగిస్తోంది. దక్షిణ ప్రాంతమైన జపోరిజ్యాలో ఉన్న మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మెలిటోపోల్ ఓ మధ్య స్థాయి నగరం. ఉక్రెయిన్‌లోని మారియోపోల్ పోర్ట్ సమీపంలో ఈ పట్టణం ఉంది.
మరోవైపు ఇవాళ కీవ్‌పై రెండు మిస్సైళ్లతో రష్యా దాడి చేసింది. కీవ్‌లోని సౌత్ఈస్ట్ ప్రాంతంపై ఇవాళ ఉదయం రెండు మిస్సైళ్లతో దాడి జరిగింది. అయితే ఎవర్ని టార్గెట్ చేశారన్నది క్లియర్‌గా తెలియదు. ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను మిస్సైల్ ఢీకొట్టినట్లు కీవ్ అధికారులు తెలిపారు. జులియాన్ విమానాశ్రయం వద్ద ఓ మిస్సైల్ పడినట్లు కొందరు తెలిపారు. కీవ్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న భారీ బిల్డింగ్ స్వల్ప స్థాయిలో ధ్వంసమైంది. ఇక్కడే ఆ మిస్సైల్ పడినట్లు అంచనా వేస్తున్నారు.