Kuwait | దుబాయ్: కువైట్లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఓవీహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. వారిలో దవాఖానలో చికిత్స పొందుతూ ఆరుగురు కన్నుమూశారు.
వీరంతా భారతీయ వలస కార్మికులే. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది. భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిని కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.