Iran President | హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మృతితో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా (Iran President) సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీ (Saeed Jalili)పై విజయం సాధించారు.
లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం).. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి. దాంతో పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెన్ ఇస్లామీ ప్రకటన చేశారు.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు. అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్ఆఫ్ పోలింగ్ నిర్వహించాలి. జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆ రౌండ్లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు. దీంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్‌ఆప్ పోలింగ్)ను నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాదిని ఇరానియన్లు ఎన్నుకున్నారు.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Hathras stampede | హథ్రస్ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?