Maldives | మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. ఆ దేశం పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నది. అయితే, గతకొద్ది ఆ దేశానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో విదేశీ కరెన్సీకి భారీగా కొరత ఏప్పడింది. మాల్దీవులు ఇప్పుడు విదేశీ కరెన్సీకి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించింది. విదేశీ కరెన్సీ ద్వారా లావాదేవీల పద్దతులు పరిమితం చేసింది. అలాగే, పర్యాటక సంస్థలు, బ్యాంకుల్లో విదేశీ మారకద్రవ్య నియంత్రణను నిర్బంధంగా అమలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుండడం గమనార్హం. ముఖ్యంగా భారత్తో సంబంధాల నేపథ్యంలో మాల్దీవులు ఆర్థిక పరిస్థితి పతనమైంది. నిజానికి మాల్దీవుల నుంచి ‘ఇండియా ఔట్’ క్యాంపెయిన్ నిర్వహించి అధికారంలోకి వచ్చిన మహ్మద్ ముయిజ్జు ప్రభుత్వ విధానాలతో మాల్దీవులను సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
దేశ ఆర్థిక వ్యవస్థతలో అత్యంత కీలకమైన పర్యాటకరంగంపై ప్రభావం చూపడంతో ద్వీప దేశం ఆర్థిక పరిస్థితి పతనమైంది. గత నెలలోనే ఇస్లామిక్ బాండ్ల చెల్లింపులో జాప్యం కారణంగా మాల్దీవులు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అంచున ఉండగా.. భారత్ 50 మిలియన్ డాలర్ల వడ్డీ లేని రుణం ఇవ్వడంతో సంక్షోభం నుంచి బయటపడింది. అయితే, విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో మాల్దీవుల దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మానిటరీ అథారిటీ ఆఫ్ మాల్దీవ్స్ (MMA) అక్టోబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి. పర్యాటక పరిశ్రమ విదేశీ కరెన్సీ ద్వారా సేకరించిన మొత్తాన్ని స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం అవసరం. ఆగస్టులోనే డాలర్ల వ్యయంపై కఠిన పరిమితి విధించిన మాల్దీవుల మానిటరీ అథారిటీ.. ఈ సారి డాలర్ల కొరత కారణంగా స్థానిక ధివేహి భాషలో కొత్త నిబంధనలను ప్రకటించింది. మాల్దీవుల్లోని అన్ని లావాదేవీలు మాల్దీవుల రుఫియాలో జరగాలని.. విదేశీ కరెన్సీలో తప్పనిసరిగా చేయాల్సిన లావాదేవీలకు మాత్రమే మినహాయింపును ఇచ్చింది.